మైదా బిస్కట్లు చిటికెలో తయారీ ఇలా...!
చంద్రవంక ఆకారంలో.. నిగనిగలాడుతూ.. నోరూరించే మైదా బిస్కట్లు చాలామందికి తెలిసినవే. ఒకవేళ వాటి గురించి తెలియకపోయినా, రుచి చూడకపోయినా ఓ సారి ట్రై చేయొచ్చు. అందుకోసం ఏ బేకరీకో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు.
కావాల్సినవి
మైదా - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు పొడి చేసుకుని ఉంచుకోవాలి
నెయ్యి - ఒక కప్పు
వంట సోడా - చిటికెడు
తయారీ విధానం
ఒక పాత్ర తీసుకుని అందులో పంచదార పొడి మొత్తం వేసుకోవాలి. మైదా పిండి, చిటికెడు వంట సోడా వేసి చేత్తో బాగా కలపాలి. ఆ పిండి మిశ్రమంలో నెయ్యి కొంచెం కొంచెం పోస్తూ బాగా కలిసేలా కలుపుకోవాలి. నీరు పోయకూడదు. నెయ్యితోనే ఆ మిశ్రమాన్ని చక్కని ముద్దలా, గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ పళ్లెంలో అట్టు మాదిరిగా నొక్కి ఉంచుకోవాలి. ఆ తర్వాత దాన్ని నచ్చిన ఆకారంలో బిళ్లలుగా కోసుకోవాలి. ఉదాహరణకు చంద్రవంక ఆకారంలో ఉండాలనుకుంటే స్టీల్ బాక్స్ పైమూతతో ముక్కలుగా కోస్తే చంద్రవంక ఆకారంలోనే వస్తాయి.
వెడల్పాటి కళాయి తీసుకుని అందులో అడుగున ఒక అంగుళం మేర ఇసుక నింపుకోవాలి. దానిని తీసుకెళ్లి గ్యాస్ స్టవ్ పై పెట్టి సన్నని మంటపై 10 నిమిషాలు ఉంచాలి. దాంతో ఇసుక వేడెక్కుతుంది. కళాయిలో పట్టేంత గుండ్రటి పళ్లెం తీసుకోవాలి. దానిలోపలి వైపు నెయ్యి రాయాలి. మైదా మిశ్రమంతో చేసుకున్న ముక్కలను పళ్లెంలో ఉంచి ఆ పళ్లాన్ని తీసుకెళ్లి కళాయిలోని ఇసుకపై ఉంచాలి. ఇప్పుడు కళాయిపైన మూత పెట్టేసి 40 నుంచి 45 నిమిషాల పాటు సన్నని మంటపై అలా ఉంచేయాలి.
ఆ తర్వాత మూత తొలగించి బిస్కెట్లను కదిలించి చూస్తే అవి బిస్కెట్లుగా మారాయో, లేదో తెలుస్తుంది. పళ్లెంలో బిస్కెట్లు సులభంగా కదలడంతోపాటు, లేత బంగారు వర్ణంలో మారితే అవి రెడీ అయినట్టే. ఇంకా అనుమానం ఉంటే, ఓ చిన్న ముక్కను టేస్ట్ చేసి చూస్తే పచ్చిగా ఉన్నదీ లేక కాలి చక్కని టేస్ట్ వచ్చినదీ తెలుస్తుంది. అవసరం అనుకుంటే మరో 10 నిమిషాల పాటు కొనసాగించుకోవచ్చు. సిద్ధమైన మైదా బిస్కెట్లను ఎయిర్ టైట్ బాక్స్ లో ఉంచుకుని వారం రోజుల వరకూ తినొచ్చు. ఈ బిస్కెట్లనే కాజు, బాదంగా మార్చుకోవాలనుకుంటే ఇసుకలో కాల్చడానికి ముందే పళ్లెంలో ముక్కలు పేర్చిన అనంతరం ఒక్కో పచ్చి బిస్కెట్ మిశ్రమంపై జీడిపప్పు, బాదం పప్పులను అమర్చుకోవచ్చు.