మైదా బర్ఫీ ఇలా చేసుకోవచ్చు!

మైదాతో చేసుకోతగ్గ బిస్కట్లలో ఎన్నో ఉన్నాయి. అందులో మైదా బర్ఫీ ఒకటి. ఇది మంచి రుచికరమైన వంటకం.

కావాల్సినవి
మైదా - ఒక కప్పు. మైదా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది వద్దనుకుంటే హోల్ వీట్ ఆటా వాడుకోవచ్చు. లేదా రెండూ సమాన పరిమాణంలో తీసుకుని ఈ ఐటమ్ చేసుకోవచ్చు.
వనస్పతి - 100 ఎంఎల్ వరకు (వనస్పతి వద్దనుకుంటే నెయ్యి)
పంచదార - పావు కప్పు (పొడి చేసినది)
నూనె - వేయించుకునేందుకు సరిపడా

తయారీ విధానం
వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో మైదా పిండి, వనస్పతి వేసి బాగా కలపాలి. దీనికి పంచదార పొడి కూడా కలుపుకోవాలి. కొంచెం నీరు చల్లి ( నీరు చాలా తక్కువ చల్లడమే కానీ, పోయరాదు) మెత్తటి ముద్దలా చేసుకోవాలి. దీనికి కావాలంటే యాలకుల పొడిని కలుపుకోవచ్చు. దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి. కాకపోతే మందంగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కత్తితో చిన్న ముక్కలు (నచ్చిన షేపులో)గా కోసుకోవాలి.

ఇప్పుడు ఓ కడాయి తీసుకుని అందులో నూనె పోసి స్టవ్ వెలిగించి దానిపై ఉంచాలి. నూనె బాగా వేడెక్కాక ముక్కలు అందులో వేసి కాల్చాలి. బంగారం రంగులోకి మారే వరకు కాల్చుకోవాలి. తర్వాత తీసి టిష్యూ పేపర్ పై ఉంచుకోవాలి. దాంతో అదనపు ఆయిల్ ను పేపర్ పీల్చేస్తుంది. ఈ బిస్కట్లను గాలి చొరబడని పాత్రలో ఉంచుకుని కావాలనిపించినప్పుడు తినొచ్చు.


More Articles