2017 జూలై - సెప్టెంబర్ కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు
సామాన్యులు ఎక్కువగా నమ్ముకునే సంప్రదాయ పొదుపు సాధనాలైన చిన్న మొత్తాల పొదుపు పథకాలు చిన్నబోతున్నాయి. మోదీ సర్కారు తరచుగా వాటిపై వడ్డీ రేట్లను కుదించుకుంటూ వెళుతోంది. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ స్థాయిలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు కూడా ఉండాలన్నది కేంద్రం విధానం.
ప్రస్తుతం బ్యాంకు వడ్డీ రేట్లు 6.50 శాతానికి పడిపోయాయి. గతంలో ఏడాదికి ఒక్కసారే వీటిపై వడ్డీ రేట్లను సమీక్షించేవారు. కానీ, మోదీ సర్కారు మాత్రం 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతీ త్రైమాసికానికి ఒకసారి వడ్డీ రేట్ల సమీక్షను అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలు క్రమక్రమంగా ఆకర్షణను కోల్పోతున్నాయి. ఎక్కువ మందికి ఆధారమైన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్లు సైతం భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేట్ల స్థాయికి చేరొచ్చేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర సర్కారు 2017 జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి (మూడు నెలల పాటు) చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను 0.10 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పలు పథకాలపై గతంలో వడ్డీ రేట్లు, ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.