'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి భారీ విజయాలతో దేశవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మరో కీలక ముందడుగు వేసింది. నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు అంతర్జాతీయ పంపిణీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ ప్రయాణంలో తమ తొలి చిత్రంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది'ని ఎంచుకుంది.

భారతీయ కథలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు చేరవేయాలనే లక్ష్యంతో హోంబలే ఫిల్మ్స్ తన ఓవర్సీస్ పంపిణీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి నాందిగా 'పెద్ది' చిత్రాన్ని ఎంచుకోవడం విశేషం. ఈ నిర్ణయంతో రామ్ చరణ్ సినిమాకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ ప్రచారం లభించనుంది. హోంబలే వంటి పెద్ద సంస్థ నేరుగా పంపిణీ చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కీలక దేశాల్లో భారీ స్థాయిలో విడుదల ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ ఇంటెన్స్ మేకోవర్, పవర్‌ఫుల్ విజువల్స్‌తో కూడిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. దీనికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ కూడా తోడవడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. 'పెద్ది' చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.