సోషల్ మీడియాలో తరచూ అత్తాకోడళ్ల గొడవలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా చూస్తుంటాం. కానీ, వారిద్దరి మధ్య ఉండే పవిత్రమైన బంధాన్ని, ప్రేమానురాగాలను చాటిచెప్పే ఒక అందమైన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. బెంగళూరులో ఉంటున్న తన కోడలి కోసం బీహార్‌కు చెందిన ఒక అత్తగారు సూట్‌కేస్ నిండా మామిడిపండ్లను ప్యాక్ చేసి పంపిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. బెంగళూరులో నివసిస్తున్న శ్రేయ అనే కోడలు, తనకు ‘మాల్దా’ రకం మామిడిపండ్లంటే చాలా ఇష్టమని తన అత్తగారితో సరదాగా చెబుతుంది. కోడలి నోటి నుంచి ఆ మాట రావడమే ఆలస్యం.. ఆ అత్తగారు ఏకంగా ఒక పెద్ద సూట్‌కేస్ నిండా నోరూరించే మాల్దా మామిడిపండ్లను ఎంతో జాగ్రత్తగా సర్దుతూ కనిపిస్తారు. ఆ సమయంలో ఆమె ఎంతో ప్రేమగా "మేరీ బహూ ఖాయేగీ" (నా కోడలు తింటుంది) అని అనడం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బెంగళూరులో ఆ సూట్‌కేస్ అందుకున్న కోడలు శ్రేయ.. లోపల ఉన్న మామిడిపండ్లను చూసి ఆనందంతో మురిసిపోవడం ఆ వీడియోలో చూడవచ్చు.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన ఈ ప్రత్యేకమైన మామిడిపండ్లు వాటి అద్భుతమైన తీపి, సువాసనకు ఎంతో ప్రసిద్ధి. అంత దూరం నుంచి పాడైపోయే అవకాశం ఉన్న పండ్లను అంత జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపడం వెనుక ఉన్న ఆ అత్తగారి ప్రేమే ఈ వీడియో ఇంత వైరల్ కావడానికి కారణమైంది.

ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారతీయ కుటుంబాల్లో ఉండే ఆప్యాయతలకు, బంధాలకు ఈ ఘటనే నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు. ఉద్యోగాల రీత్యా దూరంగా ఉంటున్న పిల్లలపై తల్లిదండ్రులు, అత్తమామలు చూపించే ఇలాంటి ప్రేమలే దూరాలను చెరిపేస్తాయని పలువురు తమ సొంత అనుభవాలను పంచుకుంటున్నారు.