యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ సినిమాలో మహిళలను అతిగా లైంగికంగా చూపించారని బీజేపీ మాజీ నేత కె. అన్నామలై తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి చిత్రాలకు ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌’ (సీబీఎఫ్‌సీ) ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. సినిమాల్లో చూపించే సన్నివేశాల విషయంలో సెన్సార్‌ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అన్నారు.

మహిళలను ఒకే కోణంలో చూపించే సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై సమాజంలో అవగాహన కల్పిస్తున్న సమయంలో ఇలాంటి చిత్రాలకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. మహిళలకు సంబంధించిన అంశాలపై జరుగుతున్న కృషిని ఇలాంటి సినిమాల చిత్రీకరణ దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు.

‘టాక్సిక్‌’ విడుదలైన తొలి రోజే రూ.104 కోట్ల వసూళ్లు సాధించిందని అన్నామలై పేర్కొన్నారు. పెద్ద హీరోలు నటించిన సినిమాల విషయంలోనూ సెన్సార్‌ బోర్డు గట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

కాగా, సినిమాపై వస్తున్న విమర్శలను హీరో యశ్‌ తిప్పికొట్టారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ను సమర్థించారు. ట్రైలర్‌ చూసి సినిమాపై అభిప్రాయానికి రావద్దని కోరారు. సినిమాలో మహిళలకు బలమైన గొంతు ఉందని చెప్పారు. అమ్మాయిలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని పిలుపునిచ్చారు.

‘టాక్సిక్‌’ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కింది. యశ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నయనతార, తారా సుతారియా, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్‌ కీలక పాత్రల్లో నటించారు.