దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దేశంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ నమోదైంది. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ 'ఏంజెల్ వన్' వ్యవస్థాపకుడు దినేష్ ఠక్కర్, సముద్ర తీరానికి అభిముఖంగా ఉన్న ఒక విలాసవంతమైన భవనాన్ని రూ. 711 కోట్లకు కొనుగోలు చేశారు. భారతదేశ చరిత్రలో ఒకే నివాస ఆస్తికి సంబంధించి జరిగిన అత్యంత ఖరీదైన లావాదేవీ ఇదే కావడం విశేషం.

ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ ఎనిమిది అంతస్తుల భవనం సుమారు 63,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఎంబసీ డెవలప్‌మెంట్స్ లిమిటెడ్' నిర్మించింది. ఈ భారీ డీల్ వార్త వెలువడిన వెంటనే, స్టాక్ మార్కెట్‌లో ఎంబసీ డెవలప్‌మెంట్స్ షేర్లు 8.3 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి.

ఈ లావాదేవీ ముంబైతో పాటు దేశవ్యాప్తంగా అల్ట్రా-లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఉన్న బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. ఇటీవల కాలంలో ఇటువంటి భారీ కొనుగోళ్లు పలుమార్లు చోటుచేసుకున్నాయి. గతంలో యూఎస్‌వీ ఛైర్‌పర్సన్ లీనా గాంధీ తివారీ రూ.639 కోట్లతో ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా, ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్, ఆయన కుటుంబ సభ్యులు రూ.400 కోట్లకు పైగా విలువైన సీ-ఫేసింగ్ టవర్‌ను సొంతం చేసుకున్నారు.

ప్రాపర్టీ డేటా విశ్లేషణ సంస్థ జాప్‌కీ ప్రకారం, జనవరి 2025 నుంచి ఇప్పటివరకు దేశంలో రూ.100 కోట్లకు పైగా విలువైన 37 రెసిడెన్షియల్ డీల్స్ జరిగాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.5,600 కోట్లుగా నమోదైంది.