బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన దత్తపుత్రిక సాధించిన విజయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన తన కుమార్తె సహారా షా (22), ఇప్పుడు కథానాయికగా వెండితెర అరంగేట్రం చేయబోతోందని విషయం తెలుసుకుని ఆయన ఆనందబాష్పాలు రాల్చారు. ముంబైలో నిర్వహించిన 'సీపీఏఏ' (క్యాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్) క్యాన్సర్ రోజ్ డే వేడుకలో ఈ ఉద్వేగభరత సన్నివేశం చోటుచేసుకుంది.

సహారాకు రెండున్నరేళ్ల వయసున్నప్పుడు, సీపీఏఏలో చికిత్స పొందుతున్న తరుణంలో వివేక్ ఆమెను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ బాధ్యతలను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారిని పూర్తిగా జయించిన సహారా, ఇప్పటికే ఏవియేషన్ శిక్షణ పూర్తి చేసి కమర్షియల్ పైలట్ కావడానికి సిద్ధమైంది. ఇదే క్రమంలో, తాను ఒక నేపాలీ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు వేదికపైనే ప్రకటించి వివేక్‌ను ఆశ్చర్యపరిచింది. అక్కడే చిత్ర ఒప్పందంపై ఆమె సంతకం చేయగా, ఆ సినిమా పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వివేక్‌ను 'దాదా' అని సంబోధిస్తూ సహారా ప్రసంగించింది. తన తండ్రి లేని లోటును తీర్చి, తన కలలను సాకారం చేసేందుకు ఆయన కొండంత అండగా నిలిచారని తెలిపింది. తన దత్త కుమార్తె ఎదుగుదలను చూసి గర్వపడిన వివేక్, "ఇది నాకు ఎంతో గర్వకారణమైన క్షణం. నువ్వొక విజేతవని ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు ప్రాణాంతక క్యాన్సర్‌పై పోరాడి గెలిచావు. నా వేలు పట్టుకున్నప్పుడే ఈ చిన్నారి తప్పకుండా విజయం సాధిస్తుందని నాకు తెలుసు" అంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

వివేక్‌-ప్రియాంక అల్వా దంపతులకు వివాన్ (13), అమేయా (11) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివేక్ మొదటి నుంచీ ఎందరో క్యాన్సర్ బాధిత చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవల తన 50వ పుట్టినరోజు సందర్భంగా మరో 50 మంది పిల్లలను దత్తత తీసుకుని, వారి పూర్తి వైద్య చికిత్స బాధ్యతలను స్వీకరించి తన ఉదారతను చాటుకున్నారు.