దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా-ఇరాన్‌ మధ్య దశలవారీ ఒప్పందంపై ఆశలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. గురువారం భారీగా పడిపోయిన సూచీలు శుక్రవారం కోలుకున్నాయి.

మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 315 పాయింట్లు లాభపడి 73,895 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 23,140 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్‌ 389 పాయింట్లు ఎగబాకి 55,762 వద్ద స్థిరపడింది.

అమెరికా-ఇరాన్‌ మధ్య దశలవారీ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు మదుపర్లలో ఆశలు పెంచాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశాలపై అంచనాలు పెరిగాయి.

చమురు ధరలు కూడా దిగివచ్చాయి. గత రెండు సెషన్లలో 7 శాతానికి పైగా పెరిగిన బ్రెంట్‌ క్రూడ్‌ శుక్రవారం బ్యారెల్‌కు 105.6 డాలర్లకు చేరువగా ట్రేడైంది. డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర 94 డాలర్ల దిగువన కొనసాగింది.

అయితే మార్కెట్లకు కొన్ని ప్రతికూల అంశాలు ఇంకా ఉన్నాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ 5 శాతానికి పైగా ఉండటం, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి.

విస్తృత మార్కెట్లలో మిశ్రమ పరిస్థితి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 0.23 శాతం నష్టపోగా.. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 0.17 శాతం లాభపడింది. నిఫ్టీ నెక్ట్స్‌ 50 కూడా 0.39 శాతం పెరిగింది. ఆటో, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, రియల్టీ రంగాల సూచీలు వరుసగా 0.76 శాతం, 0.87 శాతం, 0.70 శాతం లాభపడ్డాయి. ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు మాత్రం నష్టాల్లో ముగిశాయి.