గుంటూరు జిల్లా తెనాలిలో నలుగురు దళిత యువకులపై పోలీసులు జరిపిన దాడి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిని గురి చేసిందని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నలుగురు యువకులను కోర్టు నిర్దోషులుగా తేల్చడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పారు. ఈ ఘటనలో బాధితులు ఎదుర్కొన్న అవమానానికి, మానసిక క్షోభకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.

గతేడాది నలుగురు యువకులను పోలీసులు రోడ్డుపై దారుణంగా కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని గోరంట్ల మాధవ్ గుర్తుచేశారు. ఈ కేసులో కోర్టు యువకులను నిర్దోషులుగా విడుదల చేయడంతో, ప్రభుత్వం వారిపై తప్పుడు కేసు బనాయించిందని స్పష్టమైందన్నారు. బాధితుల గౌరవానికి, ఆత్మగౌరవానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రస్తుత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజల హక్కులను కాలరాస్తోందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత వంటి చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులు, వాటిని పక్కనపెట్టి నారా లోకేశ్ నియంత్రణలో ఉన్న 'రెడ్ బుక్'ను అమలు చేస్తున్నారని విమర్శించారు. కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దలకు జీ హుజూర్ అంటూ పోలీస్ శాఖ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.