2027 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలకమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. అతడిని పూర్తిగా ఫిట్‌గా ఉంచి, ప్రపంచకప్‌కు సిద్ధం చేయడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముందున్న ప్రధాన సవాల్‌ అని పేర్కొన్నాడు.

2027 ప్రపంచకప్ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. పాండ్యా ఇప్పటికే 2019, 2023 ప్రపంచకప్‌ల్లో భారత్ తరఫున ఆడాడు. 2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా చీలమండ గాయం కావడంతో టోర్నీకి దూరమయ్యాడు.

“ప్రపంచకప్‌లో భారత జట్టు సమతూకానికి హార్దిక్ చాలా ముఖ్యం. అతడిని మైదానంలో ఫిట్‌గా ఉంచడం గంభీర్, టీమ్‌ ముందున్న పెద్ద సవాల్‌. అతడు తగినంత క్రికెట్ ఆడటం లేదు. ఒకవేళ హార్దిక్ అందుబాటులో లేకపోతే నితీశ్ రెడ్డి తర్వాతి ప్రత్యామ్నాయం. కానీ నితీశ్‌ను హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా చూడాలంటే అప్పటివరకు అతడు వరుసగా క్రికెట్ ఆడాలి” అని గంగూలీ జియోస్టార్‌తో అన్నాడు.

రవీంద్ర జడేజా కూడా మరో ప్రత్యామ్నాయమని గంగూలీ పేర్కొన్నాడు. అయితే దక్షిణాఫ్రికాలో అక్టోబర్‌లో జరిగే ప్రపంచకప్‌లో సీమింగ్ ఆల్‌రౌండర్ అవసరం ఉంటుందని వివరించాడు. భారత టాప్‌-5 బ్యాటర్లలో ఎవరూ బౌలింగ్ చేయకపోవడంతో ఐదు లేదా ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ను ఎక్కడి నుంచో తీసుకురావాల్సి ఉంటుందని చెప్పాడు.

భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడనుండటంపైనా గంగూలీ స్పందించాడు. తొలి మ్యాచ్‌లోనే బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడం మంచిదేనన్నాడు. రెండో దశలో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. సొంత గడ్డపై జరిగే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా బలమైన జట్టుతో వస్తుందని పేర్కొన్నాడు.

మాజీ వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ కూడా షెడ్యూల్‌పై స్పందించాడు. ఆరంభంలోనే రెండు కఠినమైన మ్యాచ్‌లు ఆడటం ద్వారా జట్టు కాంబినేషన్‌ను పరీక్షించుకోవచ్చని, కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ఫామ్‌, వర్క్‌లోడ్‌ను అవసరానికి తగ్గట్టు నిర్వహించవచ్చని చెప్పాడు.