ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆకట్టుకున్న మధ్యప్రదేశ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శివాంగ్‌ కుమార్‌.. తన తదుపరి లక్ష్యాన్ని వెల్లడించాడు. టీమిండియా తరఫున ఆడటమే తన అంతిమ లక్ష్యమని తెలిపాడు. ఐపీఎల్‌లో ఆడటం, భారత టెస్టు జట్టుకు నెట్‌ బౌలర్‌గా సేవలందించడం మంచి అనుభవమే అయినా.. అసలు లక్ష్యం మాత్రం భారత జట్టుకు ఎంపిక కావడమేనని చెప్పాడు.

ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌ అయిన శివాంగ్‌.. ఐపీఎల్‌ 2026లో 13 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుతో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత టెస్టు జట్టుకు నెట్‌ బౌలర్‌గా ఉన్నాడు.

“ఐపీఎల్‌లో ఆడటం, భారత జట్టుకు నెట్‌ బౌలర్‌గా ఉండటం సంతోషంగా ఉంది. కానీ ఐపీఎల్‌ నా అంతిమ లక్ష్యం కాదు. భారత్‌ తరఫున ఆడటమే నా లక్ష్యం. ఇంకా చాలా క్రికెట్‌ ఆడాలి. ఇది నా తొలి సీజన్‌ మాత్రమే. ఇప్పుడే నా ప్రయాణం మొదలైంది” అని శివాంగ్‌ చెప్పాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రీ-సీజన్‌ శిబిరంలోనే తనకు తొలి మ్యాచ్‌ నుంచి ఆడే అవకాశం వస్తుందని సంకేతాలు అందాయని అతడు తెలిపాడు. కోచ్‌లు తన బౌలింగ్‌పై ప్రత్యేకంగా చర్చించేవారని, విభిన్న పరిస్థితుల్లో ఎలా బౌలింగ్‌ చేయాలో సూచించేవారని చెప్పాడు. “నువ్వే మా వికెట్‌ టేకర్‌” అని కూడా చెప్పేవారని వెల్లడించాడు.

తొలి మ్యాచ్‌లో అవకాశం రాకపోయినా రెండో మ్యాచ్‌ నుంచి తుది జట్టులో రెగ్యులర్‌గా చోటు దక్కిందని శివాంగ్‌ తెలిపాడు. ఆరంభంలో పెద్దగా రాణించకపోయినా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కీలక వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ కోచ్‌ల నుంచి లభించిన ప్రోత్సాహం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు. ప్రధాన కోచ్‌ డేనియల్‌ వెటోరి‌ స్పిన్నర్‌ కావడంతో బౌలర్‌ మానసిక స్థితిని బాగా అర్థం చేసుకునేవారని తెలిపాడు. కొన్ని మ్యాచ్‌ల్లో పరుగులు ఇచ్చినా.. “నువ్వు బాగా బౌలింగ్‌ చేస్తున్నావు. మంచి బంతులకు కూడా సిక్సర్లు రావచ్చు. దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు” అంటూ ధైర్యం చెప్పేవారని గుర్తుచేసుకున్నాడు.

బౌలింగ్‌ కోచ్‌ వరుణ్‌ ఆరోన్‌ కూడా తనను ఎప్పుడూ నిరుత్సాహపరచలేదని శివాంగ్‌ చెప్పాడు. “నువ్వు నీ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే చూపిస్తున్నావు. ఇంకా మెరుగ్గా చేయగలవు” అని వరుణ్‌ చెప్పేవారని తెలిపాడు. దేశం తరఫున టెస్టులు ఆడిన ఆటగాడు అలా ప్రోత్సహించడం తనకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందన్నాడు.

శివాంగ్‌ ప్రత్యేకత ఎడమచేతి మణికట్టు స్పిన్‌ మాత్రమే కాదు. అతడు బ్యాటింగ్‌ కూడా చేయగలడు. తన క్రికెట్‌ ప్రయాణాన్ని బ్యాటర్‌గానే మొదలుపెట్టానని చెప్పాడు. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉండటంతో ఐపీఎల్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం పెద్దగా రాలేదన్నాడు. అయితే తన బ్యాటింగ్‌ సామర్థ్యాలు జట్టుకు తెలుసని చెప్పాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 180.22 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తూ.. తనలోని మరో కోణాన్ని కూడా చూపిస్తున్నాడు. “నేను బ్యాటింగ్‌ కూడా చేయగలనని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా” అని శివాంగ్‌ తెలిపాడు.