ప్రముఖ దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజు ఆటలోనే పలువురు సీనియర్, యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, బంతితో అద్భుతం చేశాడు. కల్యాణి వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ తరఫున ఆడిన 36 ఏళ్ల షమీ, తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని వణికించాడు. 17.3 ఓవర్లలో కేవలం 30 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి, తనలో పదును ఇంకా తగ్గలేదంటూ సెలక్టర్లకు స్పష్టమైన సందేశం పంపాడు. అతని ధాటికి ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకే ఆలౌట్ అయింది.

మరోవైపు, విజయవాడ వేదికగా ఆంధ్ర, కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రవిచంద్రన్ స్మరణ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 218 బంతుల్లో 126 పరుగులు చేసి కెప్టెన్సీ అరంగేట్రంలోనే శతకంతో మెరిశాడు. అతనికి వికెట్ కీపర్ కృష్ణన్ శ్రీజిత్ (58) చక్కటి సహకారం అందించడంతో కర్ణాటక 274 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర, తొలిరోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది.

ఇక ఇతర మ్యాచ్‌లలోనూ స్టార్ ఆటగాళ్లు రాణించారు. రాజ్‌కోట్‌లో ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రేరక్ మన్కడ్ (92 నాటౌట్) కూడా రాణించడంతో సౌరాష్ట్ర తొలి రోజు 308/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా, ముంబై కెప్టెన్ (80 నాటౌట్) రాణించాడు. ఉత్తరప్రదేశ్ తరఫున రింకూ సింగ్, మాధవ్ కౌశిక్ శతకాలతో చెలరేగారు. మహారాష్ట్ర తరఫున అంకీత్ బావ్నే సెంచరీ చేయగా, పృథ్వీ షా (70) రాణించాడు. పంజాబ్ తరఫున ఆడిన ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.