బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, బచ్చన్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఆ కుటుంబ సమీకరణాలు ఎలా మారాయనే అంశంపై అభిషేక్ బచ్చన్ సోదరి శ్వేతా బచ్చన్ గతంలో పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' పాత ఎపిసోడ్‌లో ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమంలో హోస్ట్ కరణ్ జోహార్.. మరో సూపర్ స్టార్‌ను వివాహం చేసుకున్న తర్వాత కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారని అభిషేక్‌ను ప్రశ్నించారు. దీనికి అభిషేక్ బదులిస్తూ, తన జీవితంలో పెద్దగా మార్పులేమీ రాలేదని క్లుప్తంగా సమాధానమిచ్చారు. అయితే, శ్వేతా బచ్చన్ జోక్యం చేసుకుంటూ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. "ఒక కుటుంబంలోకి కోడలు లేదా బిడ్డ రూపంలో కొత్త వ్యక్తి ప్రవేశించినప్పుడు, అక్కడ బాధ్యతలు మరియు పాత్రలు కచ్చితంగా మారతాయి" అని ఆమె పేర్కొన్నారు.

గతంలో అభిషేక్‌కు అన్ని విషయాల్లో శ్వేత అండగా ఉండేవారని, ఇప్పుడు ఒక మెగాస్టార్ భార్య తోడైందని కరణ్ అనగా, శ్వేత ఎంతో సానుకూలంగా స్పందించారు. "ఇది శుభపరిణామం. ఒకరి మద్దతు కంటే ఇద్దరి అండ ఉండటం ఎప్పుడూ మేలే. ఐశ్వర్య కూడా అదే రంగానికి చెందిన వ్యక్తి కావడంతో చాలా విషయాలను సులభంగా అర్థం చేసుకోగలరు. ఒక నటుడిగా అభిషేక్ పనివేళలను, వృత్తిపరమైన ఒత్తిడిని ఆమె చక్కగా అవగాహన చేసుకుంటారు" అని శ్వేత వివరించారు.

'ఢాయీ అక్షర్ ప్రేమ్ కే' సినిమా ఫోటోషూట్ సందర్భంగా 1999లో అభిషేక్, ఐశ్వర్య తొలిసారి కలుసుకున్నారు. అనంతరం 2007 ఏప్రిల్ 20న వీరి వివాహం జరిగింది. ఈ జంటకు 2011లో ఆరాధ్య జన్మించింది.