రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసి కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా, హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ మృతిచెందగా, అతడి కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే, సుదర్శన్ గౌడ్ ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ జరుగుతున్న యుద్ధంలో భాగంగా క్షిపణులు, డ్రోన్ దాడుల కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సుదర్శన్ గౌడ్ భార్య విజ్ఞప్తి మేరకు, ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం, ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, సీఎం సహాయ నిధి (CMRF) నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.