ఎల్‌నినో ప్రభావంతో జలాశయాల్లో నీటి మట్టాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ మహానగరానికి నిరంతరాయంగా తాగునీటిని సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, కృష్ణా, గోదావరి నుంచి సుమారు 560 ఎంజీడీల నీరు అందుతోంది. దీనికి అదనంగా మరో 60 ఎంజీడీల నీటిని సమీకరించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కృష్ణా నది నుంచి 15 ఎంజీడీలు, మిషన్ భగీరథ ద్వారా 40 ఎంజీడీలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల నుంచి 5 ఎంజీడీల అదనపు నీటిని తరలించనున్నారు. మల్లన్నసాగర్‌లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, నవంబర్ నాటికి పైప్‌లైన్ పనులు పూర్తయితే మరో 20 ఎంజీడీల నీరు లభించనుందని అధికారులు వెల్లడించారు.

గత రెండు మూడు నెలలుగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడంతో నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని సీఎస్ సూచించారు. శుద్ధి చేసిన నీటిని తోటపని, వాహనాల శుభ్రత వంటి ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి 'గ్రీన్ ట్యాంకర్ల' ద్వారా ప్రత్యేకంగా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. తాగునీటిని ఇతర అవసరాలకు వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

మంజీరా, సింగూర్ జలాశయాలపై ఆధారపడిన మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. నీటి పొదుపుపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సినీ ప్రముఖులతో కలిసి 60 రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంజయ్ జాజు తెలిపారు. ప్రతి నీటి చుక్కనూ అమూల్యమైనదిగా భావించి, నీటి పొదుపులో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.