పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కత్తితో దాడికి యత్నం జరగడం కోల్‌కతాలో తీవ్ర కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం ఆమె కాళీఘాట్‌లోని తన నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఆ మహిళను అడ్డుకోవడంతో మమతకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన ఆమె భద్రతా ఏర్పాట్లపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన నివాసానికి సమీపంలోని దుర్గా పూజా మండపాన్ని ప్రారంభించేందుకు మమతా బెనర్జీ బయటకు వచ్చారు. అదే సమయంలో ఓ మహిళ ఆమె భద్రతా వలయాన్ని ఛేదించుకుని దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించింది. తాను మమత మేనకోడలినని, ఆమెను 'పిషి' (అత్త) అని పిలుస్తూ ముందుకు దూసుకొచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఆమె, మమతను అసభ్య పదజాలంతో దూషిస్తూ రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించింది.

వెంటనే స్పందించిన టీఎంసీ కార్యకర్తలు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తనిఖీ చేయగా ఆమె తన చీరలో ఓ కత్తిని దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై టీఎంసీ రాజ్యసభ ఎంపీ డోలా సేన్ కాళీఘాట్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితురాలిని 38 ఏళ్ల తన్నిష్ఠా సాహా (పోలీసు రికార్డుల్లో అనుసుయా సాహా)గా గుర్తించారు. ఆమె సివిక్ వాలంటీర్‌గా పనిచేస్తోందని, డ్రగ్స్‌కు బానిసగా స్థానికంగా పేరుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనను కోల్‌కతా పోలీసులు ధ్రువీకరించారు. అనుసుయా సాహా.. మమతను అడ్డగించి వాగ్వాదానికి దిగిన మాట వాస్తవమేనని తెలిపారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారని, టీఎంసీ సభ్యుల ఫిర్యాదు మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. 'Z+' కేటగిరీ భద్రత కలిగిన మమతా బెనర్జీ వద్దకు ఓ మహిళ కత్తితో ఇంత దగ్గరగా ఎలా రాగలిగిందని టీఎంసీ నేతలు భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత మమతా బెనర్జీ తన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించి, దుర్గా పూజా మండపాన్ని ప్రారంభించారు.