బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీదేవి వెల్లడించారు.

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక తేదీల్లో ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 50 శాతం పెంచుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. అక్టోబరు 9, 10, 16, 17 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణంలో అక్టోబరు 25, 26 తేదీల్లో ఈ పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయి. అయితే, సాధారణ రోజుల్లో నడిచే బస్సుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం అన్ని బస్సుల్లో యథావిధిగా కొనసాగుతుంది.

ఈ 7 వేల ప్రత్యేక బస్సుల్లో అత్యధికంగా కరీంనగర్ జోన్‌కు 3,533 బస్సులు కేటాయించారు. హైదరాబాద్ జోన్‌కు 2,155, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు 1,312 బస్సులు నడుస్తాయి. వీటితో పాటు నల్గొండకు 815, మహబూబ్‌నగర్‌కు 645, రంగారెడ్డి రీజియన్‌కు 440, మెదక్‌కు 255 బస్సులు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి అక్టోబరు 16న 1,354, 17న 1,211 బస్సులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బయలుదేరనున్నాయి.

ప్రయాణికుల కోసం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి వంటి ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పందిళ్లు, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల వంటి సౌకర్యాలను కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.