డ్రైవింగ్ చేస్తూ సినిమా చూడటం, చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం వంటి నిర్లక్ష్యపూరిత చర్యలపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఓ ఆటో డ్రైవర్ ఒకేసారి రెండు ఫోన్లు వాడుతూ, చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని సినిమా చూస్తూ వాహనం నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ డ్రైవర్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఒక నెటిజన్ పంపిన ఈ వీడియోపై సజ్జనార్ తన ‘ఎక్స్‌’ ఖాతాలో స్పందించారు. "రెండు కళ్లకు ఎదురుగా రెండు ఫోన్లు, ఒక దాంట్లో నావిగేషన్, మరో దాంట్లో సినిమా, చెవులకు పెద్ద హెడ్‌ఫోన్లు. ఇది చూడటానికి గేమింగ్ విన్యాసంలా ఉన్నా, ప్రయాణికుల పాలిట నడుస్తున్న మృత్యుశకటం" అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

డ్రైవింగ్ సమయంలో క్షణకాలం దృష్టి మళ్లినా ఘోర ప్రమాదాలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. ఇలా సినిమా చూస్తూ వాహనం నడపడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదని, క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇది 'ప్రమాదకర డ్రైవింగ్' కిందకు వస్తుందని, దీనికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. వినోదం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ఆటోను థియేటర్‌గా మార్చి జీవితాలకు ‘ది ఎండ్’ కార్డు వేయొద్దని ఆయన హెచ్చరించారు.

ఈ విషయంలో ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు. డ్రైవర్ ఫోన్ చూస్తున్నా, హెడ్‌ఫోన్లు పెట్టుకున్నా మౌనంగా ఉండవద్దని, వెంటనే ప్రశ్నించి వారించాలని కోరారు. వారు వినని పక్షంలో డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలో, వీడియోలో కనిపించిన టీజీ15యూ2657 నంబర్ గల ఆటో డ్రైవర్‌ను గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించినట్లు సజ్జనార్ వెల్లడించారు.