రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆమె అమ్మవారి సన్నిధికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పర్యటన కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేశ్ పాశ్వాన్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, ఎంపీ వల్లభనేని బాలశౌరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.

అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ ఛైర్మన్ రాధాకృష్ణ, ఈవో షీనా నాయక్ ఆమెను ఆలయంలోకి ఆహ్వానించారు. గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు ఆమెకు పట్టువస్త్రాలు, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను రాష్ట్రపతి ఆప్యాయంగా పలకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.