జైలులో ఉన్న తన ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకునే క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఓ యువతి పోలీసులకు పట్టుబడింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె వద్ద నుంచి 110 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్యకు మాదక ద్రవ్యాల అలవాటు ఉంది. ఆమె ప్రియుడు కాశీవర్ధన్ మూడు నెలల క్రితం డ్రగ్స్ సరఫరా కేసులో చిత్తూరులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అతడి బెయిల్ కోసం అవసరమైన నగదు లేకపోవడంతో, నాగసౌమ్య డ్రగ్స్ క్యారియర్‌గా మారాలని నిర్ణయించుకుంది.

విజయవాడ కృష్ణలంకకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు బషీర్, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తే రూ. 50 వేల కమిషన్ ఇస్తానని నాగసౌమ్యను ప్రలోభపెట్టాడు. దీంతో ఈ నెల 13న ఆమె బెంగళూరులోని యలహంకకు వెళ్లి, అక్కడ ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రెండు ప్యాకెట్లలో ఉన్న 110 గ్రాముల ఎండీఎంఏను తీసుకుంది. అనంతరం బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు బయలుదేరింది.

ముందస్తు సమాచారంతో ఈగల్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ రమణ బృందాలు విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిఘా ఉంచాయి. రైలులో పోలీసుల తనిఖీలను గమనించిన నాగసౌమ్య, ఈ విషయాన్ని బషీర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అతడు స్టేషన్ నుంచి పరారయ్యాడు. పోలీసులు నాగసౌమ్యను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఆమె ప్యాంటు లోపల ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో దాచిన డ్రగ్స్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బషీర్‌ను కూడా బుధవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.