హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అన్నూజిగూడ ఫ్లైఓవర్‌పై వేగంగా వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు నుంచి కిందకు దిగిపోవడంతో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

వరంగల్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఓ రెనాల్ట్ పెట్రోల్ కారులో ప్రయాణిస్తున్నారు. పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని అన్నూజిగూడ ఫ్లైఓవర్‌పైకి రాగానే, కారు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే దీనిని గమనించిన ప్రయాణికులు కారును నిలిపివేసి కిందకు దిగిపోయారు. చూస్తుండగానే మంటలు కారు అంతటా వ్యాపించి, వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ప్రయాణికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సైతం అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.