షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అజంతా, ఎల్లోరా గుహల అద్భుత శిల్పకళను చూడాలని ఉందా? ఈ రెండింటితో పాటు మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఐఆర్‌సీటీసీ ఆరు రోజుల టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 4 వరకు సాగే ఈ పర్యటనలో విమాన ప్రయాణం, హోటల్‌ వసతి సహా పలు సదుపాయాలు కల్పించనున్నారు. ఒక్కొక్కరికి ప్యాకేజీ ధర రూ.34,800 నుంచి ప్రారంభమవుతుంది.

ఎక్కడెక్కడికి వెళ్లొచ్చంటే?
ఈ యాత్ర హైదరాబాద్‌ నుంచి విమాన ప్రయాణంతో ప్రారంభమవుతుంది. మొదటి రోజు శంభాజీనగర్‌లోని బీబీ కా మక్బరా, ఎల్లోరా గుహలు, గ్రిష్ణేశ్వర్‌ ఆలయాన్ని సందర్శిస్తారు. రెండో రోజు అజంతా గుహలను చూస్తారు. మూడో రోజు శని శింగణాపూర్‌ ఆలయం మీదుగా షిర్డీ చేరుకుని సాయిబాబా దర్శనం చేసుకోవచ్చు.

నాలుగో రోజు త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగం, ఐదో రోజు సప్తశృంగి మాత ఆలయ సందర్శన ఉంటుంది. చివరి రోజు నాసిక్‌లోని పంచవటి ప్రాంతాన్ని చూసిన తర్వాత షిర్డీ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ఎవరికి ఎంత ధర?
  • గదిలో ఉండే వారి సంఖ్యను బట్టి ప్యాకేజీ ధర మారుతుంది.
  • ఒకరు ప్రత్యేక గదిలో ఉంటే రూ.45,300.
  • ఇద్దరు ఒక గదిలో ఉంటే ఒక్కొక్కరికి రూ.35,500.
  • ముగ్గురు ఒక గదిలో ఉంటే ఒక్కొక్కరికి రూ.34,800.
  • 5-11 ఏళ్ల పిల్లలకు అదనపు బెడ్‌తో రూ.31,250.

ప్యాకేజీలో ఏముంటాయి?
హైదరాబాద్‌ నుంచి శంభాజీనగర్‌కు, షిర్డీ నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణం, ఐదు రాత్రుల హోటల్‌ వసతి, అల్పాహారం, రాత్రి భోజనం, స్థానిక ప్రాంతాల సందర్శనకు ఏసీ బస్సు సదుపాయం ఉంటాయి. ప్రయాణ బీమా, టూర్‌ ఎస్కార్ట్‌ సేవలు కూడా ప్యాకేజీలో భాగం.

అయితే మధ్యాహ్న భోజనం, విమానంలో ఆహారం, ఆలయ దర్శన టికెట్లు, పర్యాటక ప్రాంతాల ప్రవేశ రుసుములు, గైడ్‌ ఛార్జీలు, వ్యక్తిగత ఖర్చులు అదనం. బుకింగ్‌కు ముందు సీట్ల లభ్యత, తాజా ధరలను ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.