తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రస్తుతం తీవ్రంగా ఉందని, 2027 ఫిబ్రవరి నాటికి అది గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలపై గణనీయమైన ప్రభావం పడిందని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగాయని చెప్పారు.

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయాన్ని గురువారం సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాగునీటి లభ్యత, సాగులో ఉన్న పంటల పరిస్థితిని అంచనా వేయడానికి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుత పరిస్థితులపై గురువారం సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.

రానున్న 15 నుంచి 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని సీఎస్‌ పేర్కొన్నారు. పంటలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడంతో విద్యుత్‌ సరఫరా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీరు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపారు. అందువల్ల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి జిల్లాకు నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో విద్యుత్‌, వ్యవసాయ శాఖల అధికారులు రైతులకు అందుబాటులో ఉండి, పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వ్యవసాయ అవసరాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖను ఆదేశించారు.

సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని సీఎస్‌ సూచించారు. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా రూపొందించిన ప్రణాళికలను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాబోయే 15 రోజుల నీటి లభ్యతను అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాతావరణ మార్పులు పంటలపై చూపే ప్రభావాన్ని వ్యవసాయ, విద్యుత్‌, సాగునీటి శాఖలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులు, స్థానిక ప్రజలను కలిసి వారి అవసరాలను తెలుసుకోవాలని, ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.