రాష్ట్రంలో ప్రజలు, రైతులు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతుంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు మాత్రం ప్రత్యేకంగా నీటిని తరలించుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

మంత్రులతో కలిసి రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై సమీక్ష నిర్వహించిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొండపోచమ్మ సాగర్ నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వి, అక్కడి నుంచి ప్రత్యేక మోటార్ల ద్వారా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

"రాష్ట్రంలో మరెవ్వరికీ లేని ఈ ప్రత్యేక సౌకర్యం ఒక్క కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మాత్రమే ఎందుకు కల్పించారు? ఈ నీటి తరలింపుపై నిజనిర్ధారణ విచారణ జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని, మేడిగడ్డ బ్యారేజీని కూల్చి మళ్లీ నిర్మించాలని కేంద్ర నిపుణులు సూచించారని రేవంత్ రెడ్డి తెలిపారు. 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు తగ్గించి సంతకాలు చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. గత దశాబ్ద కాలంలో కృష్ణా బేసిన్‌లో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ఆయన నిలదీశారు.