మెడికవర్ ఆసుపత్రి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ బహిరంగ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు మెడికవర్ ఆసుపత్రితో పాటు ఇతర అనుబంధ సంస్థల్లో వాటాలు ఉన్నాయని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు.

మెడికవర్‌లో తన కుటుంబానికి వాటాలున్నాయని నిరూపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన నేపథ్యంలో క్రిశాంక్ ఈ వీడియోతో స్పందించారు. సీఎంకు సన్నిహితులంటూ ఆయన ముగ్గురి పేర్లను వెల్లడించారు. డుంపా శిరీష రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, అన్నం శరత్ రెడ్డిలకు మెడికవర్ ఆసుపత్రి, మ్యాక్స్‌బిన్ ఫార్మా, మైండ్‌వాల్ట్ సంస్థల్లో ఉన్న షేర్ల వివరాలను సంఖ్యలతో సహా వెల్లడించారు. ఈ సంబంధాలు స్పష్టంగా కనిపిస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

మెడికవర్ ఆసుపత్రిని రూ.13,200 కోట్లకు విక్రయించారని, ఈ లావాదేవీ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని క్రిశాంక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని, లేదంటే ఆ డబ్బును రాష్ట్రంలోని రైతులకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఇదే అంశంపై ఆరోపణలు చేసినందుకు మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజా వీడియోతో ఈ వివాదం మరోసారి రాజకీయంగా వేడెక్కింది.