బంగ్లాదేశ్‌లో జరిగిన తరహాలో భారత్‌లోనూ పాలన మార్పునకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామనే పేరుతో దేశంలో అరాచకాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడమే వారి లక్ష్యమని విమర్శించారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దేశంలో ఇటీవలి పరిణామాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని రాజ్‌నాథ్‌ అన్నారు. యువత శక్తిని దేశ అభివృద్ధికి వినియోగించకుండా, రాజకీయ అస్థిరత సృష్టించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌ తరహాలో పాలన మార్పు తీసుకురావాలని కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వారి వ్యాఖ్యలను బట్టి ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరచడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు.

అధికారం కోసమే అరాచకమా?
ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని కాంగ్రెస్‌ చెబుతున్నా.. అసలు లక్ష్యం అధికారం చేజిక్కించుకోవడమేనని రాజ్‌నాథ్‌ ఆరోపించారు. ‘పాలన మార్పు’ వంటి పదాలను ఉపయోగించడం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాజకీయ స్వార్థం కోసం దేశ ప్రయోజనాలను పక్కనపెడితే ప్రజాస్వామ్య చర్చలు వాస్తవాల ఆధారంగా కాకుండా మొండివైఖరి, దుష్ప్రచారానికి వేదికగా మారతాయని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యం పేరుతో అరాచకాన్ని సృష్టించడానికి, రాజ్యాంగ సంస్థలపై దాడులకు, దేశాభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎవరికీ హక్కు లేదని రాహుల్‌ గాంధీని ఉద్దేశించి అన్నారు. చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతలను కాపాడుకోవాలని, రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీయకూడదని సూచించారు. ప్రజల తీర్పును గౌరవించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామనే పేరుతో రాజకీయ గందరగోళం సృష్టించడం మానుకోవాలని రాహుల్‌కు హితవు పలికారు.

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ..
కాంగ్రెస్‌ గతంలోనూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను దెబ్బతీసిందని రాజ్‌నాథ్‌ విమర్శించారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ, 1984లో సిక్కులపై జరిగిన హింస, 1990లో కరసేవకుల హత్యలకు సంబంధించిన పరిణామాలను ప్రస్తావించారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌ వైఖరిలో మార్పు లేదని ఆరోపించారు.

“1975లో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ జేబులో రాజ్యాంగాన్ని పెట్టుకుని అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని కూడా ఆయన ఆరోపించారు. 1993లో ఎన్నికల కమిషనర్ల నియామకం, అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌.. ఎన్నికల కమిషనర్‌ నవీన్‌ చావ్లాపై చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. చావ్లా కాంగ్రెస్‌ నేతలకు ఎన్నికల సంఘానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని చేరవేశారని శేషన్‌ ఆరోపించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఆయనను తొలగించకుండా కాపాడటమే కాకుండా, తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించిందని రాజ్‌నాథ్‌ విమర్శించారు.