చిత్తూరు జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన దాడుల వెనుక వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కుట్ర ఉందని బీసీవై (BCY) పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడులకు పూర్తి బాధ్యత వారిదేనని, ఎంపీ మిథున్‌రెడ్డి కుట్రకు తానే ప్రత్యక్ష సాక్షినని ఆయన వ్యాఖ్యానించారు. దీక్షలో ఉన్న తాను రాత్రి పన్నెండు గంటల సమయంలో మేడపైకి వెళ్లగా, పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లో మిథున్ రెడ్డి తన అనుచరులు, గూండాలతో సమావేశమై ఈ దాడులకు వ్యూహరచన చేశారని ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి, ఎన్నికలు ముగిసే వరకు జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుట్రపై సమగ్ర విచారణ జరిపి, పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేయాలని కోరారు. చంద్రబాబుకు పెద్దిరెడ్డి కుటుంబంతో లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు.

నామినేషన్ల వేళ రణరంగం

శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే పుంగనూరు రణరంగంగా మారింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ నేతలు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో, ఎంపీ మిథున్‌రెడ్డికి సంబంధించిన వాహనాలు టీడీపీ కార్యకర్తలపైకి దూసుకెళ్లాయని, వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

పోలీసుల రంగ ప్రవేశం, లాఠీఛార్జ్

ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. అనంతరం టీడీపీ, వైసీపీ నేతలను అక్కడి నుంచి పంపించివేసి, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అయితే, టీడీపీ కార్యకర్తల నిరసనల మధ్య ఎంపీ మిథున్‌రెడ్డి చాలాసేపు నామినేషన్ల కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు ఆయనను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, బయట టీడీపీ శ్రేణులు ఆందోళన కొనసాగించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదే తరహాలో తిరుపతిలోని నామినేషన్ కేంద్రం వద్ద కూడా ఘర్షణలు చెలరేగినట్లు సమాచారం. మొత్తంగా, నామినేషన్ల తొలిరోజే జరిగిన ఈ హింసాత్మక ఘటనలతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.