శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెనుకొండ సమీపంలోని గొల్లపల్లి జలాశయంలో ఈతకు వెళ్లి ఐదుగురు మహిళలు నీట మునిగి మృతి చెందారు. విహారయాత్ర కోసం వెళ్లిన వీరి జీవితాల్లో ఈ సంఘటన అంతులేని విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే, పెనుకొండ పట్టణంలోని దర్గాపేటకు చెందిన కొందరు మహిళలు శుక్రవారం విహారయాత్ర కోసం గొల్లపల్లి జలాశయానికి వెళ్లారు. వీరిలో ఐదుగురు సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఊహించని విధంగా మునిగిపోయారు. సమీపంలో ఉన్నవారు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను మహీం, హసీనా, పుష్పలత, గాయత్రమ్మ, అశ్వినిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి లోకేశ్

ఈ దురదృష్టకర సంఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపల్లి జలాశయం వద్దకు విహారయాత్రకు వెళ్లి ఐదుగురు మహిళలు మృత్యువాత పడటం చాలా బాధాకరం. మృతులకు నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది" అని లోకేశ్ పేర్కొన్నారు.

ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు ఒకేసారి మృతి చెందడంతో దర్గాపేటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది.