తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ తెలంగాణ సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎల్‌నినో పేరుతో ప్రభుత్వం చేతులెత్తేస్తోందని మండిపడ్డారు. అత్యంత కీలకమైన సాగునీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు అందుబాటులో ఉన్నప్పటికీ మూడు మాత్రమే నడిపిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. తాము అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని అన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ వర్షపాతం నమోదైనా అక్కడ కరవు పరిస్థితులు, పంటల సాగుకు విరామం ప్రకటించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. గోదావరి-కావేరి అనుసంధానం పేరుతో తెలంగాణ నీటిని తరలించే ప్రతిపాదనలకు రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు. గతంలో గోదావరి-బనకచర్ల, గోదావరి-నల్లమలసాగర్‌ ప్రతిపాదనలు ముందుకు సాగలేదని, ఇప్పుడు గోదావరి-కావేరి అనుసంధానం పేరుతో కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ నేతలు ఇలాంటి ప్రతిపాదనలు చేయలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏపీ పాలకులు కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.