ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం దళితులు, ఆదివాసీలు, మైనారిటీ వర్గాలకు చెందినవే ఉన్నాయని అన్నారు.

2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, దాని పరిరక్షణ కోసమే 2017లో రాహుల్ గాంధీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ పోరాటం కాంగ్రెస్ భవిష్యత్తు కోసం కాదని, దేశ ప్రజల భవిష్యత్తు కోసమని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలను భారత ఎన్నికల సంఘం గతంలోనే ఖండించింది. 13 కోట్ల ఓట్లను తొలగించారనడం అవాస్తవమని, ముసాయిదా జాబితాల రూపకల్పన సమయంలో 'నివాసం లేనివారు, చిరునామా మారినవారు, మరణించినవారు, డూప్లికేట్' కేటగిరీ కింద గుర్తించిన వారి సంఖ్య మాత్రమే అదని ఈసీ అక్టోబర్ 2న ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ ద్వారా మొదటి బ్యాచ్‌లో 50 మందికి, రెండో బ్యాచ్‌లో 100 మంది నిపుణులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.