ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'రామాయణం పార్ట్-1'పై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర దర్శకుడు నితీశ్ తివారీతో పాటు చిత్రబృందాన్ని అభినందిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది నవంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

సామాజిక మాధ్యమాల వేదికగా రాజమౌళి స్పందిస్తూ, "ప్రతి భారతీయ కథకుడు చెప్పాలని కలలుగనే మహత్తర గాథ రామాయణం. నితీశ్ తివారీ, నమిత్ మల్హోత్రా ఇంతటి భారీ స్థాయిలో ఈ ఇతిహాసాన్ని వెండితరపైకి తీసుకురావడం అభినందనీయం. ప్రధాన నటీనటులందరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. నవంబర్ 5 కోసం నేను ఆత్రుతగా వేచి చూస్తున్నాను. చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. ఇంతటి భారీ వ్యయంతో ఒక భారతీయ సినిమా రూపుదిద్దుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

గతంలో రామాయణ, మహాభారత ఘట్టాలను వెండితెరపై ఆవిష్కరించడం గురించి రాజమౌళి పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ఇతిహాసాలను గతంలో తెరపై చూపిన విధానం పట్ల తాను ఎప్పుడూ పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని ఓ అంతర్జాతీయ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భవిష్యత్తులో తనదైన శైలిలో ఆ గాథలను దృశ్యరూపంలోకి తీసుకురావాలనే ఆకాంక్షను కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 'రామాయణం' చిత్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

నితీశ్ తివారీ, శ్రీధర్ రాఘవన్ సంయుక్తంగా రచన చేసిన ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.