టీజీఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన తమకు ధ్రువీకరణ పత్రం (విక్టరీ సర్టిఫికెట్) అందజేయడంలో కార్మిక శాఖ జాప్యం చేస్తోందని టీజీఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆరోపించింది. ఎన్నికల్లో గెలుపొందిన తమకు వెంటనే సర్టిఫికెట్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేతలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ)లతో కూడిన జేఏసీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడి అనేక రోజులు గడుస్తున్నా కార్మిక శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అనవసరంగా ఆలస్యం చేస్తున్నారని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే కార్మిక శాఖ అధికారులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని జేఏసీ నేతలు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. కార్మిక శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని నేతలు స్పష్టం చేశారు.