నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న బీగల ఆంజనేయస్వామి గుడికి వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మూడు బొమ్మల దుకాణాలు, ఒక శీతల పానీయాల దుకాణం, రెండు హోటళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుల అంచనా ప్రకారం సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలోని హోటళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లను సకాలంలో బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.