వైసీపీ సీనియర్ నేత, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఓటర్లకు ఒక్కో ఓటుకు రూ.4,000 చొప్పున అధికార కూటమి చెల్లించాలని ఆయన డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారింది.

ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార కూటమి బలవంతంగా ఏకగ్రీవాలు చేయిస్తోందని, దీనివల్ల ఎన్నికల సమయంలో ప్రజలకు అందాల్సిన డబ్బు అందడం లేదని రాచమల్లు ఆరోపించారు. ఎన్నికలు జరిగి ఉంటే, టీడీపీ రూ.2,000, వైసీపీ మరో రూ.2,000 చొప్పున ఓటర్లకు పంచిపెట్టేవని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు.

ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే పండుగ సీజన్‌లో కనీసం రూ.16,000 వస్తాయని ప్రజలు ఆశించారని, కానీ ఏకగ్రీవాల వల్ల ఆ అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు. అందుకే, పోటీ లేనందున టీడీపీ, వైసీపీ తరఫున ఇవ్వాల్సిన మొత్తం రూ.4,000 కలిపి, ప్రభుత్వమే టీడీపీ నేతల ద్వారా ప్రజల ఇళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు.

ఓటుకు డబ్బుల పంపిణీని బహిరంగంగా సమర్థించడమే కాకుండా, నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాచమల్లు వ్యాఖ్యలను కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.