పెట్టుబడిదారులు తమ షేర్లను సులభంగా విక్రయించి డబ్బులు వెనక్కి తీసుకుంటుండటం కూడా స్టాక్ మార్కెట్ బలహీనపడటానికి ఒక కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. అదే సమయంలో విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడం 2027లో భారత్‌కు పెద్ద సవాలుగా మారవచ్చని హెచ్చరించారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మార్కెట్‌లో నగదు లభ్యత సులభంగా ఉండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను త్వరగా ఉపసంహరించుకుంటున్నారని ఆమె వివరించారు.

ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగం వైపు మళ్లుతున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. ఏఐతో సంబంధం ఉన్న కంపెనీల్లో పెట్టుబడుల కారణంగా తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లపై పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వివరించారు. అమెరికా, ఏఐ రంగాల వైపు నిధులు తరలిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఏఐ పెట్టుబడుల ఊపు తగ్గి మార్కెట్లు పడిపోయినా భారత్‌పై దాని ప్రభావం తక్కువగా ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఆ తరహా పెట్టుబడులు పెద్ద ఎత్తున రాకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. అధునాతన సాంకేతిక రంగంలో భారత్ వెనుకబడలేదని, సెమీకండక్టర్ తయారీపై కూడా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు.

ఈ ఏడాది ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్ ప్రధాన సూచీలు దాదాపు 12 శాతం పడిపోయాయి. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. అయినా విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు.

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీల్లో 33 బిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు. అక్టోబర్ 16న మాత్రం వరుసగా 15 సెషన్ల పాటు విక్రయాలు జరిపిన తర్వాత ఎఫ్‌ఐఐలు మళ్లీ నికర కొనుగోలుదారులుగా మారారు. ఆ రోజు సుమారు రూ.1,166 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) 45 సెషన్ల కొనుగోళ్ల పరంపరను ముగించి, సుమారు రూ.3,661 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.