భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇటీవల ఇండిగో విమానంలో సాధారణ ప్రయాణికుడిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ముగ్గురు తోబుట్టువులు ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా, అదే విమానంలో రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వారిలో ఒకరు ద్రవిడ్ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ అడిగారు. మరో తోబుట్టువు ఈ దృశ్యాన్ని తమ ఫోన్‌లో రికార్డ్ చేశారు. సాధారణంగా ప్రైవసీకి ప్రాధాన్యమిచ్చే ద్రవిడ్, వారిని నిరాశపరచకుండా చిరునవ్వుతో ఆటోగ్రాఫ్ ఇచ్చి మాట్లాడాడు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌పోర్ట్ బస్సులో కూడా వారు ద్రవిడ్‌ను మళ్లీ చూశారు.

ఈ వీడియోను "@bhai.saaabb" అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. "ఇందిరానగర్ కా గూండా, కానీ నిజ జీవితంలో చాలా మంచివారు" అనే క్యాప్షన్‌తో దీన్ని పంచుకున్నారు. ద్రవిడ్ ఓ యాడ్‌లో కోపంగా నటించిన తీరును ప్రస్తావిస్తూ పెట్టిన ఈ క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పటికే 24 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ద్రవిడ్ సింప్లిసిటీని, అభిమానుల పట్ల ఆయన చూపిన ఆదరణను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.