హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. యువతిగా నటిస్తూ వాట్సాప్‌లో పరిచయం పెంచుకుని, ఏకంగా ఒక పోలీసు అధికారిని బ్లాక్‌మెయిల్ చేసిన పవన్ అనే నిందితుడిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి వలలో వందలాది మంది బాధితులు చిక్కుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

పవన్ అనే యువకుడు వాట్సాప్‌లో యువతి పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి, ఒక పోలీసు అధికారితో స్నేహం చేశాడు. చాటింగ్ ద్వారా కొంతకాలం నమ్మకాన్ని కలిగించిన అనంతరం, సదరు అధికారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైదాబాద్ పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, అతని నేర చరిత్రను వివరించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను విశ్లేషించగా వేల సంఖ్యలో వాట్సాప్ చాటింగ్‌లు లభ్యమయ్యాయి. అతని బాధితుల జాబితాలో వందలాది మంది ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

నిందితుడి మోసాల పరిధి కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాలతో పాటు దుబాయ్ వంటి విదేశాల్లో ఉన్న వారిని కూడా లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నపోలీసులు, ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.