టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అత‌ని అర్ధాంగి సాక్షి.. అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో సందడి చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ టౌన్‌షిప్‌లో నిన్న‌ జరిగిన ఈ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌తో కలిసి ధోనీ దంపతులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్నివాల్‌లో ధోనీ, అనంత్ అంబానీ సరదాగా గడిపారు. ఇద్దరూ కలిసి డ్రాగన్ బోట్ వంటి ఫాస్ట్ రైడ్‌ను ఎంజాయ్ చేశారు. అభిమానులతో ముచ్చటిస్తూ, సాక్షితో కలిసి ఐస్‌క్రీం తింటూ ధోనీ చాలా కూల్‌గా కనిపించారు. ఈ కార్నివాల్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 

గిరగిరా తిరిగే ఒక రైడ్ ఎక్కమని అనంత్ అంబానీ ధోనీని ఆహ్వానించారు. అయితే, దానికి ధోనీ సున్నితంగా నిరాకరించారు. ఆ రైడ్ ఎక్కితే తనకు కళ్లు తిరుగుతాయని సరదాగా సైగలు చేస్తూ వివరించారు.

అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన ఈ నవరాత్రి వేడుకల్లో కార్నివాల్ రైడ్స్‌తో పాటు గర్బా, ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ధోనీ, అనంత్ అంబానీ కలిసి గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.