దేశ రాజకీయాల్లో "రెజీమ్ ఛేంజ్" (అధికార మార్పిడి) అనే పదం పెను దుమారం రేపుతోంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ధీటుగా బదులిచ్చారు. తాము ఆశిస్తున్నది స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలే తప్ప, అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూల్చడం కాదని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను విమర్శిస్తూ జేఎన్‌యూ విద్యార్థి కార్యకర్త నేహా బోరా 'రెజీమ్ ఛేంజ్' అని వ్యాఖ్యానించిన వీడియో క్లిప్‌లతో పాటు, ప్రతిపక్షాలకు మద్దతిచ్చే మరికొందరి దృశ్యాలను జత చేస్తూ కిరణ్ రిజిజు 'ఎక్స్‌' వేదికగా ఒక పోస్ట్ చేశారు. "ఈ వ్యక్తులను చూడండి, వీరు అధికార మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, భారత్ బంగ్లాదేశ్ కాదు. భారత యువత ఎంతో తెలివైన వారు, వారు దేశాన్ని నిర్మిస్తారు తప్ప నాశనం చేయరు" అని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై శశిథరూర్ స్పందిస్తూ, "భారత్‌ను బంగ్లాదేశ్‌తో లేదా ఫ్రాన్స్‌తో పోల్చడం అసంబద్ధం. ఫ్రాన్స్‌లో జరిగినట్లుగా బస్సులను తగలబెట్టడం, పోలీస్ స్టేషన్లపై దాడులకు దిగడం వంటి హింసాత్మక చర్యలను మేమెప్పుడూ సమర్థించం. మేము కేవలం శాంతియుత నిరసనలకు మాత్రమే మద్దతు తెలుపుతాం" అని అన్నారు. 'రెజీమ్ ఛేంజ్' అనే పదాన్ని వక్రీకరించవద్దని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజల పేర్లను అస్తవ్యస్తమైన, పాక్షికంగా చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో తొలగించారని శశిథరూర్ ఆరోపించారు. "ఇది పూర్తిగా రాజ్యాంగపరమైన సమస్య. ఈ లోపాలను సరిదిద్దాలని మాత్రమే మేము కోరుకుంటున్నాము. అంతేకానీ, అక్రమ మార్గాల్లో ప్రభుత్వాన్ని కూలదోయాలనే ప్రయత్నం ఎంతమాత్రం కాదు" అని ఆయన వివరణ ఇచ్చారు.