భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఓ అరుదైన ఘనత నమోదైంది. మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ క్వాడ్రపుల్ సెంచరీ (400 పరుగులు) సాధించి చరిత్ర సృష్టించాడు. సోమవారం నాగాలాండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు అజేయంగా 400 పరుగులు చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 400 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా చిన్మయ్ నిలిచాడు.

సోవిమాలోని నాగాలాండ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చిన్మయ్ సుతార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన కెరీర్‌లో కేవలం రెండో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న అతను, ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో రంజీ ట్రోఫీ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. గతంలో పృథ్వీ షా చేసిన 379 పరుగుల రికార్డును సుతార్ అధిగమించాడు. ఈ జాబితాలో 1948-49 సీజన్‌లో మహారాష్ట్ర తరఫున నింబాల్కర్ చేసిన 443* పరుగుల స్కోరు మాత్రమే చిన్మయ్ కంటే ముందుంది.

టీ విరామ సమయానికి 392 పరుగులతో క్రీజులో ఉన్న సుతార్, ఆ తర్వాత 155వ ఓవర్‌లో 400 పరుగుల మార్కును అందుకున్నాడు. మొత్తం 517 బంతులు ఎదుర్కొని 46 ఫోర్లు, 7 సిక్సర్లతో ఈ భారీ స్కోరు సాధించాడు. సుతార్ 400 పరుగులు పూర్తి చేయగానే మిజోరం 581/9 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

ఈ మ్యాచ్‌లో ఓ దశలో మిజోరం 391 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో పదో నంబర్ బ్యాటర్ లాల్రెమ్పుయియా చక్చువాక్‌తో కలిసి చిన్మయ్ సుతార్ అద్భుత పోరాటం చేశాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు అజేయంగా 190 పరుగులు జోడించి జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు. రంజీ చరిత్రలో పదో వికెట్‌కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

ఈ ఇన్నింగ్స్‌తో బ్రియన్ లారా (501 నాటౌట్), హనీఫ్ మహ్మద్ (499) డాన్ బ్రాడ్‌మన్ (452) వంటి దిగ్గజాల సరసన చిన్మయ్ సుతార్ చేరాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 400కు పైగా పరుగులు చేసిన పదో బ్యాటర్‌గా అతను నిలిచాడు. ముంబైకి చెందిన సుతార్, గతంలో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్‌లో మిజోరం తరఫున ఆడేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందాడు. తన తొలి మ్యాచ్‌లోనే 35, 99 (రనౌట్) పరుగులతో సత్తా చాటాడు.