తీవ్ర ప్రమాదం నుంచి ఫ్లైదుబాయ్ విమానాన్ని ఓ ప్లంబర్ తన సమయస్ఫూర్తితో కాపాడారంటూ వస్తున్న వార్తలను ఆ విమాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ స్పందించారు. ఆ ప్లంబర్ గురించి తనకు కనీస సమాచారం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం యూఏఈలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న పైలట్ స్మిత్, అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో ఎమర్జెన్సీ తలెత్తిన సమయంలో, ప్రయాణికుడిగా ఉన్న యానివ్ హయూన్ అనే ప్లంబర్ తన సాహసంతో ప్రమాదాన్ని నివారించినట్లు వార్తలు వచ్చాయి. 'ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్' అనే టీవీ షోలో చూసిన అంశాలను ఆధారంగా చేసుకుని, కంట్రోల్ స్టిక్స్‌ను వెనక్కి లాగి విమానాన్ని స్థిరపరిచానని హయూన్ గతంలో పేర్కొన్నారు. అనంతరం విధుల్లో లేని మరో పైలట్ సహాయంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వివరించడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.

ఈ కథనాలపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ స్పందిస్తూ, "నిజం చెప్పాలంటే ఆ ప్లంబర్ ఉదంతం గురించి నాకేమీ తెలియదు. విమానంపై ఆకస్మిక దాడి జరిగినప్పుడు, అది కూలిపోకుండా కాపాడేందుకే నేను సర్వశక్తులు ఒడ్డాను. నన్ను నేను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాను" అని వెల్లడించారు. విమానం కెప్టెన్ నియంత్రణలోనే ఉందంటూ ఓ సీనియర్ అధికారి చెప్పిన మాటలు మాత్రమే తనకు గుర్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక ప్లంబర్ విమానాన్ని ల్యాండ్ చేయగలడా అనే ఊహాగానాలపై తాను స్పందించబోనని ఆయన స్పష్టం చేశారు.

దాడి జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు తనకు పూర్తిగా గుర్తులేవని కెప్టెన్ స్మిత్ వివరించారు. తీవ్రమైన దాడి జరుగుతున్నప్పటికీ, ఎంతో శ్రమించి తన సీట్‌ బెల్ట్‌ విప్పుకుని కాక్‌పిట్ తలుపులు తెరిచినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.