తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో పర్యటించి, పలు అభివృద్ధి పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అవసరమైతే కార్మికుల సంఖ్యను పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

డిసెంబర్ 7 నుంచి 9 వరకు 'భారత్ ఫ్యూచర్ సిటీ' వేదికగా జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026' ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 'మీ పెట్టుబడులు మాతో సురక్షితం' అనే భరోసాతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌ను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలోనే నిర్వహించనున్నందున, యూనివర్సిటీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి, సదస్సు ఏర్పాట్లపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

ఈ సదస్సును అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని, దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ఏర్పాట్లు ఉండాలని సీఎం సూచించారు. నవంబర్ 15 నాటికి ఓపెన్ ప్రమిసెస్ పనులు, నవంబర్ చివరి నాటికి సమ్మిట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని గడువు విధించారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కేవలం ఒక వ్యాపార సదస్సు మాత్రమే కాదని, ఇది తెలంగాణ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక చరిత్రాత్మక వేదిక అని ఉద్ఘాటించారు. సదస్సు విజయవంతం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించారు. అనంతరం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ ప్రాంగణంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (నిమ్) క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమాల్లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.