చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు నడిసంద్రంలో చిక్కుకుని సుమారు 24 గంటల పాటు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో యంత్రం మొరాయించగా, అటు జోరు వానలో వారు ప్రాణభయంతో గడిపారు. 

చివరకు తోటి మత్స్యకారుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన డాక్టర్‌ బి.ఆర్. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో చోటుచేసుకుంది.

అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన పలువురు మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కాట్రేనికోన మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరిలో ఐదుగురు ఆదివారం తెల్లవారుజామున నీలరేవు తీరం నుంచి ఫైబర్ బోటులో వేటకు వెళ్లారు. 

అయితే, సముద్రంలోకి వెళ్లిన కొంతసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి బోటు ఆగిపోయింది. అదే సమయంలో భారీ వర్షం కురువడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాధారణంగా సాయంత్రానికి తిరిగి రావాల్సిన వారు రాకపోవడంతో తోటి మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది.

సోమవారం ఉదయం తోటి మత్స్యకారులు పలు బోట్లలో సముద్రంలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సముద్రంలో నిలిచిపోయి ఉన్న బోటును గుర్తించి, అందులోని ఐదుగురిని మరో బోటు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. 

విషయం తెలుసుకున్న మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మత్స్యకారులు ప్రాణాలతో క్షేమంగా తిరిగి రావడంతో వారి కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.