ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారత్‌ పరిష్కారాలు చూపగలదని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. పర్యావరణ విధ్వంసం, వైవిధ్యాన్ని నిర్వహించడం, కుటుంబ వ్యవస్థ బలహీనపడటం, ఆధిపత్య పోరుతో కలిగే నష్టాల వంటి సమస్యలతో సంపన్న దేశాలు సైతం సతమతమవుతున్నాయని పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయాల్లో ఈ సమస్యలకు సమాధానాలు ఉన్నాయనే నమ్మకంతో ప్రపంచం భారత్‌ వైపు ఆసక్తిగా చూస్తోందని చెప్పారు.

నాగ్‌పుర్‌లోని రేషింబాగ్‌ మైదానంలో మంగళవారం జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ వార్షిక విజయదశమి సభలో భగవత్‌ ప్రసంగించారు. సంఘ్‌ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

భారత రాజ్యాంగ పీఠిక దేశ ప్రజల మధ్య భావోద్వేగ బంధానికి ప్రతీకగా నిలుస్తోందని భగవత్‌ అన్నారు. భాషలు, ప్రాంతాలు, కులాలు, ఆహారపు అలవాట్లు వేర్వేరుగా ఉన్నా దేశాన్ని ఒక్కటిగా నిలిపేది ఈ బంధమేనని పేర్కొన్నారు. పూర్వీకులు ఈ ఐక్యతను గుర్తించారని, దాన్ని మరచిపోయిన సందర్భాల్లో దేశం పతనాన్ని ఎదుర్కొందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా విదేశీ పాలన నుంచి విముక్తి లభించిందని గుర్తుచేశారు.

సంఘ్‌ శతాబ్ది ఏడాది నేపథ్యంలో సామాజిక సామరస్యం, వ్యక్తిత్వ నిర్మాణం, సమాజం పట్ల బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని భగవత్‌ పిలుపునిచ్చారు. సమాజ మార్పు కోసం ప్రభుత్వంపైనే ఆధారపడకుండా ప్రజలు కూడా తమ వంతు కృషి చేయాలని సూచించారు. విభజనకు దారితీసే ‘మనవాళ్లు- పరాయివాళ్లు’ అనే భావనను విడనాడాలని, చట్టాన్ని గౌరవిస్తూ జాతీయ ఐక్యత, స్వదేశీ భావనలను బలోపేతం చేయాలని కోరారు.

దేశాభివృద్ధికి యువత ఆరోగ్యంగా, దృఢంగా ఉండటంతో పాటు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలని భగవత్‌ అన్నారు. క్రమశిక్షణ, వ్యక్తిత్వం, ఆరోగ్యం జాతీయ బలానికి కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వాతంత్ర్య పోరాట కాలం కంటే ఎక్కువ అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.