విజయదశమి పర్వదినం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన సైకిల్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ గుర్తు కావడంతో పాటు, అది తన తొలి వాహనం కూడా కావడంతో ఈ పూజలకు ప్రాధాన్యత ఏర్పడింది. మంగళవారం విజయనగరం రూరల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పూజల అనంతరం ఆయన తన అర్ధాంగి ప్రభానాయుడుతో కలిసి సైకిల్‌పై సరదాగా విహరించారు.

ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ.. తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన తన తొలి వాహనం సైకిల్‌కు ప్రతి ఏటా విజయదశమి నాడు ఆనవాయతీగా పూజలు చేస్తుంటానని తెలిపారు. పసుపు వర్ణం శుభానికి, ఆరోగ్యానికి, ఆనందానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో నూతన ఆశలు, విజయాలు, సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

అనంతరం పలువురు టీడీపీ నాయకులు ఎంపీని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలన్నీ సమన్వయంతో పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ కలిశెట్టి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.