పులివెందులలో వైసీపీ నాయకుల ఆస్తులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, దీని వెనుక అధికార కూటమి నేతల హస్తం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, వైసీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

గత వారం రోజులుగా పులివెందులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయని అవినాశ్ రెడ్డి తెలిపారు. నాలుగు రోజుల క్రితం పులివెందులలో ఓ చికెన్ సెంటర్‌ను తగలబెట్టారని, ఈ ఘటనలో టీడీపీ నేతలు విజయ్ కుమార్ రెడ్డి, షమీర్‌ల ప్రమేయం స్పష్టంగా ఉన్నప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 

అలాగే, కౌన్సిల్ అభ్యర్థి నిరంజన్ రెడ్డికి చెందిన చెక్ బుక్కులను కూడా కాల్చివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడుల గురించి స్పష్టమైన సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఘటనల సమయంలో పోలీసులు అక్కడే ఉండి హింసను ప్రోత్సహిస్తున్నారనే అనుమానం కలుగుతోందని అన్నారు.

నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘటనకు సంబంధించి 900కి పైగా కేసులు నమోదు చేశారని, సంబంధం లేని వారిని కూడా అరెస్టు చేస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. భయాందోళనలు సృష్టిస్తే వైసీపీ కార్యకర్తలు ప్రచారానికి రారని అధికార పక్షం భావిస్తోందని విమర్శించారు. పోలీసు, పరిపాలన యంత్రాంగంతో ఈ విధమైన బుల్డోజర్ పాలన అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఓ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన బైక్‌ను తగలబెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయని చెప్పారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసి, ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.