మాంసం కోసం వెళ్లి కరోనాను తెచ్చుకోవద్దు: హరీశ్ రావు సలహా

  • సిద్ధిపేట గ్రీన్ జోన్ లో ఉందని నిర్లక్ష్యం వద్దు
  • మాస్క్ లేకపోతే వెయ్యి జరిమానా తప్పదు
  • అందరం కలిసి కరోనాను ఎదుర్కొందాం
కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే కరోనాతో సహజీవనం తప్పేటట్టు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో ఈరోజు గ్యాదరి బాల్ రాజ్ జ్ఞాపకార్థం కరుణ క్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1400 మందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. ఈ కార్యక్రమానికి హరీశ్ రావుతో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, కరోనా వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రూ. 1500 నగదు, 12 కిలోల బియ్యం ఇచ్చామని చెప్పారు. రెండవ దశలో మరో రూ. 1500 కూడా ఇస్తున్నామని తెలిపారు. సిద్ధిపేటలో ఇప్పటికే 12 వేల మందికి సాయం అందిందని చెప్పారు.

సిద్ధిపేట గ్రీన్ జోన్ లో ఉందని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని హరీశ్ అన్నారు. సామాజిక దూరం పాటించకుండా గుమికూడవద్దని... మాంసం కోసం వెళ్లి రోగం తెచ్చుకోవద్దని హితవు పలికారు. మాస్క్ లేకుండా బయట తిరిగితే రూ. 1000 జరిమానా తప్పదని హెచ్చరించారు. అందరం కలసికట్టుగా మహమ్మారిని ఎదుర్కొందామని అన్నారు.


More Telugu News