కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ చుట్టుపక్కల 10వేల ఎకరాలు ఆక్రమించింది: రేవంత్ రెడ్డి

  • మహేందర్ రెడ్డికి అపాయింటుమెంట్ ఇవ్వలేదు.. కానీ ఇప్పుడు మంత్రిని చేశారని విమర్శ
  • జుట్లు పట్టుకున్నవారు ఇప్పుడు పదవులు పంచుకుంటున్నారని ఆరోపణ
  • కొడంగల్ నియోజకవర్గానికి కేసీఆర్ ఏం చేశారని ప్రశ్న


ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి నాలుగేళ్లుగా అపాయింటుమెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి తప్ప తాండూరుకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. నిన్నటి వరకు జుట్లు పట్టుకున్న వారు ఇప్పుడు పదవులు పంచుకుంటున్నారని విమర్శించారు. తాండూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ... తాండూరుకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న చేవెళ్ల ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలన్నారు.

కొడంగల్ అసెంబ్లీ నియోజవకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ లేదా కేటీఆర్ దత్తత తీసుకుంటే కొడంగల్‌కు ఏం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులకు శిలాఫలకాలు వేయడం తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు.

కొడంగల్‌కు రెండేళ్లలో కృష్ణా నీటిని తెస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఇక్కడి ప్రజలను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రెండుచోట్ల నుండి పోటీ చేస్తున్నారన్నారు. ఓటమి భయం ఆయన గొంతులో కనిపిస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ చుట్టుపక్కల 10వేల ఎకరాలను ఆక్రమించిందని ఆరోపించారు.


More Telugu News