పోలీసు ఉన్నతాధికారులపై నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు

  • విజయవాడ సీపీ కార్యాలయానికి వచ్చిన బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ 
  • దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్‌కి పోలీసు ఉన్నతాధికారులపై ఫిర్యాదు అందజేసిన కాదంబరి 
  • నాటి విజయవాడ సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కీలకంగా వ్యవహరించారని ఆరోపణ చేసిన కాదంబరి
ఏపీ పోలీస్ ఉన్నతాధికారులపై బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో నాటి విజయవాడ సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కీలకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొంది. గురువారం రాత్రి విజయవాడ సీపీ కార్యాలయానికి చేరుకున్న నటి కాదంబరి .. దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్ ను కలిసి ఫిర్యాదు అందజేసింది.

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారన్నారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబయి వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని చెప్పారు. విద్యాసాగర్ ను వెంటనే అరెస్టు చేసి తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని కాదంబరి ఫిర్యాదులో కోరింది.

దర్యాప్తు అధికారికి ఫిర్యాదు అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కుటుంబాన్ని నాశనం చేసి పబ్బం గడుపుకోవాలని విద్యాసాగర్ చూస్తున్నారని అన్నారు. 17 క్రిమినల్ కేసులు ఉన్న విద్యాసాగర్ కు వైసీపీ నేతలు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఈ కేసులకు రాజకీయ రంగు పులమడం అన్యాయమన్నారు. వీలైనంత త్వరగా ఈ దారుణ పరిస్థితుల నుండి బయటపడాలని కోరుకుంటున్నానన్నారు. కొందరు పోలీసు అధికారులు పరిధి దాటి వ్యవహరించడంతోనే వారిపైన ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.


More Telugu News